NEWSTELANGANA

ఓరుగ‌ల్లుపై వివ‌క్ష‌ ఎందుకింత క‌క్ష‌ – రాకేష్ రెడ్డి

Share it with your family & friends

కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. హామీల పేరుతో అధికారంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓరుగల్లు (వ‌రంగ‌ల్ ) రైతు బిడ్డ‌గా తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని, సీఎం రేవంత్ రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ లో ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయంటూ ప్ర‌శ్నించారు. దాని సంగ‌తి మ‌రిచి పోయారంటూ మండిప‌డ్డారు. అది వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ కాద‌ని వ‌రంగ‌ల్ సాక్షిగా కాంగ్రెస్ వంచ‌న డిక్ల‌రేష‌న్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వరి పంట కోతలు ప్రారంభమై నెల దాటి పోయినా ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించ లేద‌ని నిప్పులు చెరిగారు ఏనుగుల రాకేష్ రెడ్డి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేసే ఉద్దేశం ఉందా లేదా అని నిల‌దీశారు.

ఓ వైపు రైతులు పండించిన ప‌త్తి మార్కెట్లో త‌డిసి పోతుంటే ఇంకా సీసీఐతో మాట్లాడ‌క పోవ‌డం, కొనుగోలు కేంద్రాలు తెర‌వ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదేనా రైతుల ప‌ట్ల మీకున్న చిత్త‌శుద్ది అని ధ్వ‌జ‌మెత్తారు.
గుజరాత్ లో పత్తిని 8 వేల నుండి 8,500 కొనుగోలు చేస్తున్నారని, అదే మ‌ద్ద‌తు ధ‌ర‌ను ఎందుకు తెలంగాణ‌లో ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌ర్కార్ కు, సీఎం రేవంత్ రెడ్డికి మోడీని , కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌డం లేద‌ని నిప్పులు చెరిగారు.

రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న మంత్రులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెర‌వేర్చే ద‌మ్ము లేదు కానీ తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడటం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని అన్నారు. ఇక‌నైనా సీఎం త‌న స్థాయికి త‌గిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. రాజ‌కీయాల‌లో హుందాత‌నం అత్యంత ముఖ్య‌మ‌ని, ఇది రాచ‌రిక వ్య‌వ‌స్థ కాద‌ని గుర్తిస్తే మంచిద‌ని పేర్కొన్నారు.