సర్కార్ నిర్వాకం విద్యా రంగం నాశనం
నిప్పులు చెరిగిన ఏనుగుల రాకేశ్ రెడ్డి
ములుగు జిల్లా – రాష్ట్ర ప్రభుత్వం కావాలని విద్యా రంగాన్ని నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురుకుల బాట పట్టారు. ఆదివారం ములుగు జిల్లాలోని జాకరం, బండారు పల్లి, చాల్వాయ్ లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లలో పర్యటించారు. ఆయనతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగ జ్యోతి ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా విద్యా శాఖ మంత్రి లేరన్నారు. భవిష్యత్ తరాలకు పునాదులు వేసే విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని వాపోయారు. సీఎం సోయి లేకుండా మాట్లాడుతున్నారని , పాలనా పరంగా ఇంకా పరిణతి చెందలేదన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే నిరుపేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో వరుస మరణాలు, ఆహార విషతుల్యం జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. చలి కాలం పిల్లలకు దుప్పట్లు ఇవ్వక పోవడం దారుణమన్నారు. అందుకే తాము దుప్పట్లను పంపిణీ చేశామన్నారు.
హాస్టల్ లలో పరిస్థితి అద్మాన్నంగా ఉందన్నారు. డార్మెటరీ లో విద్యార్థులు ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి లేదన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.