స్టడీ పేరుతో మంత్రుల విహార యాత్ర
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా లేవని, ఖజానాను ఖాళీ చేసే విధంగా ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా స్టడీ టూర్ కానే కాదని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఇక్కడ మూసీ అభివృద్ది కోసం అక్కడ అధ్యయనం చేసేందుకు వెళ్లినట్లు కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పు దోవ పట్టించడం తప్ప మరేమీ కాదన్నారు.
ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పులు చేస్తున్నామని పదే పదే ప్రకటిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి మంత్రుల టూర్ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు సీఎం, డిప్యూటీ సీఎం , ఇతర మంత్రులు విదేశీ పర్యటనలు చేశారని, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చారని, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో తెలియ చేయాలని డిమాండ్ చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.
ఈ సందర్బంగా గత 10 ఏళ్ల కాలంలో కేటీఆర్ 24 సార్లు విదేశాలకు వెళ్లారని, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య పరంగా నిధులు తీసుకు వచ్చారని తెలిపారు. రూ.56,000 ఐటీ ఎగుమతులు కేటీఆర్ కృషి ఫలితంగా రూ. 2.2 లక్షలకు పెరిగాయని , 3.3 లక్షల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు 8.5 లక్షలకు పెరిగాయని వెల్లడించారు రాకేశ్ రెడ్డి.
కేటీఆర్ కృషి ఫలితంగా తెలంగాణలో 23,000 కొత్త కంపెనీలు వచ్చాయని స్పష్టం చేశారు. రూ. 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 17 లక్షల ప్రైవేట్ జాబ్స్ దక్కాయని తెలిపారు. మీ పర్యటన వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప లాభం లేదని పేర్కొన్నారు.