జగ్గారెడ్డి కామెంట్స్ పై రాకేశ్ రెడ్డి కన్నెర్ర
మహిళా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు తగదు
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు నోరు పారేసు కోవడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి. శనివారం ఆయన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డిపై నిప్పులు చెరిగారు. స్థాయి మరిచి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాను రాను దిగజారుడు మాటలతో సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యథా రజా తథా ప్రజా అన్నట్టుగా తయారైందని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఇప్పటికే అన్ని వ్యవస్థలు నిద్ర పోతున్నాయని, ఇదే సమయంలో బాధ్యత వహించాల్సిన నేతలు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు స్థాయి మరిచి కామెంట్స్ చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ రెడ్డి.
తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి మీరు చెప్పదల్చుకున్నారో మీకేమైనా తెలుసా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో జగ్గారెడ్డి మహిళా కలెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మహిళలను కించ పరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. ఆఫీసుకు రావడం లేదు, ఇంట్లో ఏం చేస్తోంది..మొగని పక్కన పడుకుందా అని పీఏకు ఫోన్ చేశానంటూ చెప్పడం దారుణమన్నారు.
అసలు జగ్గా రెడ్డి ఎవరు..ఆయన స్థాయి ఏమిటో తనకు తెలుసా అని నిలదీశారు. అయినా అధికారులు ఏమైనా నాయకులకు పాలేర్లా అని మండిపడ్డారు. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీ తప్పా కాంగ్రెస్ మంత్రులు, నేతలకు కాదని తెలుసుకుంటే మంచిదన్నారు ఏనుగుల రాకేశ్ రెడ్డి.