గురుకుల విద్యార్థుల అరిగోస
ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆవేదన
ములుగు జిల్లా – బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేతలు గురుకులాల బాట పట్టారు. ఇందులో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో పర్యటించారు. జాకారం గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ అందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలకు మహర్దశ కల్పించారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. తాను కూడా కష్టపడి చదువుకున్నానని, చదువుకునే సమయంలో వసతి సౌకర్యాలకు నోచుకోక పోవడం బాధను కలిగిస్తోందన్నారు.
ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాపోయారు. పాలకుల అసమర్థత కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దాదాపు 1000 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ (విష ఆహారం ) తో ఆస్పత్రి పాలయ్యారని, అయినా సీఎంకు సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు ఏనుగుల రాకేశ్ రెడ్డి. సమస్యలు పరిష్కరించేంత దాకా తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.