ఈ విజయం దేశ ప్రజలకు అంకితం
శ్రీలంక దేశ అధ్యక్షుడు దిస నాయకే
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిస నాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం దేశ ప్రజలందరికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ గెలుపు కోసం 34 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. ఈ అలుపెరుగని ప్రయాణంలో ఎందరో త్యాగాలు చేశారని, మరికొందరు జీవించి ఉన్నారని, ఇంకొందరు ఇక్కడ ఇప్పుడు లేరని అన్నారు.
ఈ విజయం కోసం కొంత మంది తమ జీవితాలతో త్యాగం చేసిన మునుపటి తరాల ధైర్యవంతులైన పురుషులు,మహిళలను తాము గౌరవిస్తామని, ఇదే సమయంలో స్మరించుకుంటామని స్పష్టం చేశారు అనుర కుమార దిసనాయకే.
ఈ విజయం, సంపన్న దేశాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారి వారసత్వానికి నివాళిగా నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. అపనిందలు, అబద్ధాలు, తప్పుడు సమాచారం ఉన్నప్పటికీ మమ్మల్ని విశ్వసించి, గొప్ప దృఢ సంకల్పంతో తమ రాజకీయ ఉద్యమాన్ని ఎన్నుకున్న వారితో సహా ప్రజలందరూ కలిసి ఈ దేశాన్ని నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకునే శక్తిని కలిగి ఉన్నారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు దిస నాయకే.
తమ సంకల్పం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. తాము కోరుకునే మార్పు అనేక దశలను కలిగి ఉందన్నారు. ఇది ఆచరణలోకి రావాలంటే కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, విశ్వాసాన్ని సాధించడం చాలా కీలకమన్నారు.
తాము తక్షణమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు ప్రారంభించాలని, విస్తరించిన క్రెడిట్ సదుపాయానికి సంబంధించిన కార్యకలాపాలను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు అనుర కుమార దిస నాయకే.
అదనంగా రుణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రక్రియను వేగవంతం చేయడానికి, అవసరమైన రుణ ఉపశమనాన్ని పొందేందుకు సంబంధిత రుణదాతలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
ముఖ్యంగా ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన నివేదికలు లేకుండా శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలను మాత్రమే నిర్వహించడంలో తాము విజయం సాధించామన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సానుకూల పరిస్థితిని నిర్ధారించడం, స్థిరీకరించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు శ్రీలంక అధ్యక్షుడు.
ఈ సమయంలో, మన దేశాన్ని నిర్మించడంపై సమిష్టి దృష్టితో రాజకీయాల్లో పాల్గొనడం ప్రాముఖ్యతను తాను హైలైట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు . జాతి, మతం, తరగతి, కులాల ఆధారంగా విభజన యుగాన్ని పూర్తిగా ముగించి, భిన్నత్వాన్ని గౌరవించే ఏకీకృత శ్రీలంక దేశాన్ని నిర్మించడానికి శాశ్వత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు శ్రీలంక అధ్యక్షుడు.
ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులను నియమించడానికి ఇప్పటికే ముఖ్యమైన చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. ప్రజా సేవ చెక్కు చెదరకుండా ఉండేలా పౌరులు ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండేలా తాము కోరుకున్న మార్పుల వైపు స్థిరంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
పౌరులందరి సామాజిక భద్రతకు భరోసా ఇస్తూ చట్టాన్ని గౌరవించే దేశాన్ని సృష్టించేందుకు , క్రమశిక్షణతో కూడిన సమాజాన్ని పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు అనుర కుమార దిసనాయకే.