మాంత్రికుడిని కాదు సామాన్య పౌరుడిని
శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకే
శ్రీలంక – శ్రీలంక నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనుర కుమార దిస నాయకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తాను అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి వచ్చానని, ఆ ఇబ్బందులు ఏమిటో దగ్గరుండి చూశానని చెప్పారు.
మీరంతా నా మీద పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తాను మాంత్రికుడిని కాదని చెప్పారు. నేను ఓ సాధారణ కూలీ కొడుకునని , ఇప్పటికీ అలాగే ఉంటానని చెప్పారు. ఎవరైనా తన వద్దకు రావచ్చని ప్రకటించారు.
ప్రస్తుతం అందరి చూపు మన దేశం వైపు ఉందని తనకు తెలుసన్నారు. ఇవాళ తనపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. దీనిని సమర్థవంతంగా ముందుకు నడిపించడమే తన ముందున్న అతి పెద్ద సవాలుగా అనుర కుమార దిసనాయకే ప్రకటించారు.
నా వద్ద ఎలాంటి మంత్ర దండం లేదన్నారు. నేను కొన్ని సామర్థ్యాలు, అసమర్థతలతో కూడిన సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టం చేశారు. నాకు తెలిసినవి, నాకు తెలియనివి చాలా ఉన్నాయని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.
నా సామర్థ్యాలను పెంపొందించు కోవడం, నా జ్ఞానాన్ని విస్తరించు కోవడం , దేశాన్ని పరిపాలించడానికి అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోవడం నా ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించారు అనుర కుమార దిస నాయకే.