ప్రజాస్వామిక హక్కులకు కట్టుబడి ఉన్నాం – అనుర
దేశ ప్రజలకు శ్రీలంక అధ్యక్షుడి భరోసా
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. తాము ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చామో వాటిని నెరవేర్చేందుకు నేషనల్ పీపుల్స్ పవర్ సిద్దం చేస్తుందని కుండ బద్దలు కొట్టారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
శ్రీలంక దేశానికి చెందిన ప్రజలంతా తమపై పూర్తి నమ్మకంతో అధికారాన్ని కట్ట బెట్టారని వారికి మరోసారి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు అనుర కుమార దిసనాయకే . తమ తొలి ప్రాధాన్యత ఒక్కటేనని, అది విద్య, ఆరోగ్యం , ఉపాధి కల్పన, ధరల స్థిరీకరణతో పాటు ప్రజల హక్కులకు రక్షణ కల్పించడమని చెప్పారు శ్రీలంక నూతన అధ్యక్షుడు.
అందుకే ప్రజలతో గత కొన్నేళ్లుగా పని చేస్తూ వచ్చిన డాక్టర్ హరిణిని ప్రధానమంత్రిగా నియమించడం జరిగిందన్నారు. పూర్తి పారదర్శకతతో పాలన సాగుతుందని, ఇటు భారత్ అటు చైనాతో సత్ సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు అనుర కుమార దిస నాయకే.
తాము ప్రజల సార్వ భౌమాధికారంపై బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామని ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు .