పుస్తకాలు చదవకుండా నేను ఉండలేను
శ్రీలంక ప్రెసిడెంట్ అనుర దిసనాయకే
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలు ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయని అన్నారు. అందులో జీవితంతో పాటు సమాజం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
శనివారం దేశ రాజధాని కొలంబోలో ఏర్పాటు చేసిన బండారు నాయకే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాల్ ప్రాంగణంలో జరుగుతున్న కొలంబో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు ఆయన హాజరయ్యారు. సాహిత్య మాసం సందర్భంగా 25వ సారి నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.
ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు పుస్తకాల స్టాల్స్ ను అనుర కుమార దిసనాయకే సందర్శించారు. కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు. ఇందులో దేశానికి చెందినవే కాకుండా విదేశాలకు చెందిన స్టాల్స్ ను కూడా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన కొత్త పుస్తకాల గురించి ఆరా తీశారు.
శ్రీలంక బుక్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సమంతా ఇందీవర పిల్లల పుస్తకాలపై జాతీయ విధానం ముసాయిదాను శ్రీలంక ప్రెసిడెంట్ అనుర దిసనాయకేకు అందించారు. అనంతరం బుక్ స్టాల్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు ప్రెసిడెంట్. జీవితంలో తాను కోల్పోయిన ప్రతీసారి తనను మనిషిగా, లీడర్ గా తిర్చిదిద్దింది పుస్తకాలేనని చెప్పారు. పుస్తకాలు చదవకుండా తాను ఉండలేనని అన్నారు.