శ్రీలంక అధ్యక్షుడిగా కొలువు తీరిన అనుర
30 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం ఇది
శ్రీలంక – శ్రీలంక దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిస నాయకే సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ ఉదయం శ్రీలంక లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య సమక్షంలో డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక దేశానికి 9వ కార్య నిర్వాహక అధ్యక్షుడి (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్)గా ప్రమాణ స్వీకారం చేశారు అనుర కుమార దిస నాయకే.
ఈ సందర్బంగా శ్రీలంక దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడు. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది నా ఒక్కడి విజయం కానే కాదని అన్నారు. ఇది సమస్త శ్రీలంక ప్రజల గెలుపుగా అభివర్ణించారు. అవినీతికి తావు లేని విధంగా ప్రజా పాలన సాగుతుందని ప్రకటించారు అనుర కుమార దిసనాయకే.
ఈ దేశానికి కొత్త పునరుజ్జీవన ఉద్యమానికి నాంది పలికేందుకు నా వంతుగా బాధ్యతను నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నానని ప్రకటించారు. ఈ కష్ట కాలంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తనకు మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానని అన్నారు అనుర కుమార దిస నాయకే.
ఈ స్థాయికి, అత్యున్నతమైన అధ్యక్షుడి పదవిని చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. తమ పార్టీ గత 1994 సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే వస్తోందని అన్నారు .
చివరకు 30 సంవత్సరాల తర్వాత తమ కల నెరవేరిందని, ఈరోజు కోసం కోట్లాది మంది ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారని, దానిని తలుచుకున్నప్పుడల్లా తనకు కళ్లల్లో నీళ్లు వస్తాయని అన్నారు అనుర కుమార దిస నాయకే.