NEWSANDHRA PRADESH

జూలై 22 నుండి అసెంబ్లీ సమావేశాలు

Share it with your family & friends

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి

అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు జూలై 22 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై రాష్ట్ర అసెంబ్లీ భవనంలో పోలీస్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు.

ఈసందర్భంగా రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, కొంతమంది శాసన మండలి సభ్యులు హాజరు కానున్ననేపధ్యంలో ఆయా సభ్యులను సక్రమంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన సెక్యురుటీ జోన్ అని, ఎవరు బడితే వారు లోనికి ప్రవేశించకుండా,ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సిసి కెమోరాలు సక్రమంగా పని చేసేలా చూసుకోవాలని సూచించారు.

రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సమావేశాలు సుమారు 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉందన్నారు. బందోబ‌స్తుపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు . గ్యాలరీల్లో ప్లేకార్డులతో కొంతమంది ప్రవేశించిన సంఘటనలు చూశామని అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాంతి భద్రతల ఐజి శ్రీకాంత్, గుంటూర్ రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి,గుంటూర్ ఎస్పి సతీష్ కుమార్, ఎస్పిఎఫ్ ఎస్పి యం.శంకర్ రావు, గుంటూరు అదనపు ఎస్పి శ్రీనివాసరావు, విజయవాడ డిసిపి చక్రవర్తి, సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి, భద్రయ్య తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.