ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లో పని చేస్తున్న 50 వేల మందికి పైగా ఉద్యోగులకు కూడా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఈ మేరకు సీఈవో కీలక ప్రకటన చేశారు.
ఇదిలా ఉండగా పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు స్పష్టం చేశారు . అంతే కాకుండా అత్యవసర విభాగాలలో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు ముఖేష్ కుమార్ మీనా.
ఇందులో భాగంగా రైల్వే ,విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్ తో పాటు తదితర డిపార్ట్మెంటులలో పనిచేసే ఉద్యోగులకు, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసే మీడియా ప్రతినిధులుకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు సీఈవో.