పిన్నెల్లి వీడియోపై సీఈవో కామెంట్
తాము విడుదల చేయలేదని ప్రకటన
అమరావతి – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యవహారం. ఆయనపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతోంది. అధికారం ఉంది కదా అని రెచ్చి పోతే ఎలా అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉండగా ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఈ సందర్బంగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అధికార మదంతో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు.
అక్కడ సిబ్బంది వద్దని వారించినా వినిపించు కోలేదు. ఆపై ఈవీఎంను నేల కేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీ టీవీ ఫుటేజ్ లో భద్రంగా నిక్షిప్తమై పోయింది. ఇది బయటకు వచ్చింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వెంటనే ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియాను తాము విడుదల చేయలేదని అన్నారు.