నిందితులు రెండు రోజుల్లో అరెస్ట్
ప్రకటించిన ఏపీ సీఈవో మీనా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణానికి భంగం కలిగిస్తూ వచ్చిన అల్లరి మూకలపై ఫోకస్ పెట్టామని అన్నారు. ఎవరైనా, ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ముఖేష్ కుమార్ మీనా.
ఏపీలోని చాలా ప్రాంతాలలో గొడవలకు కారణమైన వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డీజీపీని ఆదేశించడం జరిగిందని చెప్పారు ఏపీ సీఈవో. అల్లర్లకు ఎగ దోసిన వారితో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని గుర్తించి కేవలం 2 రోజుల్లోపే అరెస్ట్ చేస్తారని చెప్పారు .
అంతే కాకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సీలు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు , ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు , ఇతర దళాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.
అయితే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆయా పార్టీలకు చెందిన ప్రతినిధులు 24 గంటల పాటు ఉండవచ్చని,, ఇందుకు తాము అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.