ఆరు చోట్ల పోలింగ్ సమయాల్లో మార్పు
ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశామని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.
అయితే పోలింగ్ డే రోజున ఆరు చోట్ల పోలింగ్ సమయాలలో మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు ముకేష్ కుమార్ మీనా. ఇప్పటికే ప్రకటించిన విధంగానే వచ్చే నెల మే 13న రాష్ట్ర వ్యాప్తంగా శాసన సభ , లోక్ సభకు ఎన్నికలు చేపడతామని తెలిపారు.
ఆరోజు జరగబోయే ఎన్నికల్లో 6 అసెంబ్లీ స్థానాలకు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. కాగా అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
పాలకొండ, కురపాం, సాలూరు అసెంబ్లీ స్థానాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వీధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని, 300 కంపెనీ బలగాలు రాష్ట్రానికి వస్తాయని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.