బాధితులకు చంద్రబాబు భరోసా
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఓ వైపు వయసు పెరుగుతున్నా ఎక్కడా తగ్గడం లేదు. పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఓ వైపు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూనే మరో వైపు ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు.
తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్బంగా కొందరు గత ప్రభుత్వంలో తాము పడిన ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు.
వైసీపీ నేతలు అక్రమంగా లాక్కున్న తమ ఆస్తులను తిరిగి తమకు అప్పగించేలా చూడాలని కోరారు. సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకొచ్చారని యానిమేటర్లపై డ్వాక్రా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. వికలాంగులు, వృద్ధులు వచ్చి సీఎంకి తమ బాధలు చెప్పుకున్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. మీ అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్రమంగా తీసుకున్న ప్రతి డబ్బును తిరిగి మీకు అప్పగించేలా చేస్తానని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా తనయుడు , మంత్రి లోకేష్ కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు.