వరద ప్రభావిత ప్రాంతాలలో బాబు పర్యటన
రెండో రోజూ కూడా సమీక్ష..సాయంపై ఆరా
అమరావతి – ఓ వైపు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి పోతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
సచివాలయంలో ఉండకుండా వరద ప్రభావితం ఎక్కువగా ఉన్న విజయవాడలోనే మకాం వేశారు. నిద్ర పోకుండా సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. ఓ వైపు మంత్రులను అలర్ట్ చేస్తూనే మరో వైపు ఉన్నతాధికారులను పనులపై పురమాయిస్తున్నారు.
మొత్తంగా ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి లోటు రాకుండా ఉండేలా చూడడంలో జాగ్రత్త వహించారు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఇంకో వైపు మంత్రులతో సమన్వయం చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఇబ్బంది ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కు చెప్పాలని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క బెజవాడ లోనే 15 వేల మందికి పైగా నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని చెప్పారు ఏపీ సీఎం.
ఆయన రెండో రోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. వరదల్లోనే బోటుపై ప్రయాణం చేయడం విశేషం.