దివ్యాంగులు ఓటు వేసేలా చర్యలు
ప్రకటించిన ఏపీ ఎన్నికల కమిషనర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు సానుకూల వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దా ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. ‘హోమ్ ఓటింగ్’ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించు కోవాలనుకునే వికలాంగులు బీఎల్ఓ ద్వారా ఆర్వోకు ఫార్మ్ 12 డి సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది వికలాంగులు ఉన్న పోలింగ్ స్టేషన్లలో రెడ్ క్రాస్, ఎన్.ఎస్.ఎస్, ఎన్సీసీ వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి ఓటు హక్కు వినియోగించు కునేందుకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు ముకేశ్ కుమార్ మీనా.
దివ్యాంగ ఉద్యోగులు, నిండు గర్భిణీ/ బాలింత ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలను కోరామన్నారు.
ఇదిలా ఉండగా గత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవడంలో దివ్యాంగులు ఎదుర్కున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాలని దివ్యాంగ సంఘాల ప్రతినిథులను కోరారు.