ఎన్నికల అక్రమాలపై ఫోకస్
నివారణకు కోఆర్డినేటర్ల ఎంపిక
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఉండేందుకు కోఆర్డినేటర్లను నియమించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కీలక ప్రకటన చేసింది. ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు, క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారాలకు తోడ్పాటు అందించేందుకు, ఎన్నికలలో అక్రమాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తమ దృష్టికి వచ్చిన అక్రమాలను, సమస్యలను ఎన్నికల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిఘా సమన్వయకర్తలు 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ , ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను నియమించినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి. భవాని ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎల్. వి .సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు.
శనివారం వారు మీడియాతో మాట్లాడారు. అనంతపూర్ జిల్లా కోఆర్డినేటర్ గా ఎస్పీ టక్కర్ , కర్నూలు జిల్లాకు సమన్వయకర్తగా డబ్ల్యూఆర్ రెడ్డి, కడప జిల్లాకు సంతోష్ మెహ్రా, జన చైతన్య వేదిక రాష్ట్ర చీఫ్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, చిత్తూరు జిల్లాకు డాక్టర్ పి. రఘును నియమించినట్లు చెప్పారు.
నెల్లూరు జిల్లాకు రాంమ శంకర్ నాయక్, ప్రకాశం జిల్లాకు డి. చక్రపాణి, గుంటూరు జిల్లాకు జీవీ కృష్ణారావు, కృష్ణా జిల్లాకు రాజీవ్ శర్మ, టి. సురేష్ బాబులను కోఆర్డినేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు రిటైర్డ్ జిల్లా జడ్జి ఏ .లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకు తమిళనాడు కేడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ జమ్మూ, కాశ్మీర్ గవర్నర్ సలహాదారులు స్కందన్ కుమార్ కృష్ణన్, విశాఖపట్నం జిల్లాకు డాక్టర్ దిలీప్ సింగ్, విజయనగరం జిల్లాకు అజయ్ మిశ్రా, శ్రీకాకుళం జిల్లాకు వెంకట రమణలను ఎన్నికల నిఘా సమన్వయ కర్తలుగా నియమించినట్లు చెప్పారు.