రాజ ముద్రతో పట్టాదారు పాస్ బుక్స్
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. సోమవారం సచివాలయంలో రెవిన్యూ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఇక నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనవాళ్లు ఎక్కడా ఉండవని స్పష్టం చేశారు.
ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. సమీక్ష అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ఫోటోలతో ఇప్పటి వరకు పట్టాదారు పుస్తకాలు ఉండేవని, తాము వచ్చాక వాటిని తీసి వేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని చెప్పారు.
ఇందులో భాగంగా ఇక నుంచి జగన్ రెడ్డి ఫోటో లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ఉన్న రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సందర్బంగా తాము ఇచ్చిన హామీ మేరకు దీనిని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల జగన్ పీడ విరగడ అయ్యిందని మండిపడ్డారు. వ్యక్తుల ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని, తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు.