కీలక అంశాలపై చర్చలు
అమరావతి – సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, దావోస్ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులు, మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ, తదితర అంశాల గురించి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రాన్ని ఐటీ, లాజిస్టిక్, పరిశ్రమలకు హబ్ గా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోం ఏర్పాటు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మెంబర్లు, డైరెక్టర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, సినీ రంగానికి చెందిన వారు సైతం హాజరయ్యారు.
ఆతిథ్యం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఎట్ హోం లో పాల్గొంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో కీలక అంశాల గురించి చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.