NEWSANDHRA PRADESH

అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటాం – సీఎం

Share it with your family & friends

భారీ వ‌ర్షాలు..వ‌ర‌ద‌ల‌కు పంట‌లు నీటిపాలు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వ‌ర్షాలు, వ‌రద‌ల‌కు దెబ్బ తిన్న పంట‌ల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు రైతుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. వ‌ర‌ద‌ల‌కు దెబ్బ తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని సీఎం తెలిపారు. శాస‌న‌స‌భ‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌మ ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, న‌ష్టం అంచ‌నాల‌ను ప‌రిశీలించాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా త‌మ ప్రాంతాల్లో జరిగిన న‌ష్టం వివ‌రాల‌ను సేక‌రించి అంద జేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. వర్షాలు, వరదలపై శాసన సభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు.

ఈ వ‌ర‌ద‌ల్లో తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కోన‌సీమ‌, కాకినాడ‌, ఏలూరు జిల్లాల్లో పంట‌లు దెబ్బ‌తిన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా మెట్ట‌ ప్రాంత‌మైన‌ప్ప‌టికీ అక్క‌డ కూడా వ‌ర‌ద‌ల వ‌ల్ల కొంత న‌ష్టం ఏర్ప‌డింద‌న్నారు.

ప్రాథ‌మిక అంచ‌నాల మేర‌కు ఈ వ‌ర‌ద‌ల్లో 4,317 ఎక‌రాల్లో ఆకు మడులు పూర్తీగా దెబ్బ‌తిన్నాయ‌ని తేలింద‌న్నారు. 1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రినాట్లు వేశారని, అదంతా కూడా వ‌ర‌ద‌ నీటి ముంపున‌కు గురైందన్నారు. 3,160 ఎక‌రాల్లో మొక్క‌జొన్న‌, 960 ఎక‌రాల్లో ప‌త్తి పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు. . ఈ న‌ష్టం అంచనాల‌న్నీ కేవ‌లం ప్రాథ‌మిక అంచ‌నాలేన‌ని పేర్కొన్నారు.

క్షేత్ర‌స్థాయికి వెళ్లిన‌ప్పుడు ఈ న‌ష్టం ఇంకా పెరిగే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపారు సీఎం. తూర్పు గోద‌వారి జిల్లాలో 273 ఎక‌రాల్లో పంట‌లు ఇప్పుడు కూడా నీళ్ల‌లోనే మునిగిపోయి ఉన్నాయ‌ని వాపోయారు. ప్ర‌కృతి విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైన ఉంటుందన్నారు.

గ‌తంలో హుదుద్‌, తిత్లీ తుపాన్లు వ‌చ్చిన‌ప్పుడు కూడా ప్రజలకు సాయం చేశామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ఐదారు జిల్లాల్లో వ‌చ్చిన విప‌త్తుల వ‌ల్ల న‌ష్ట‌ పోయిన వారంద‌రికీ కూడా సాయం అందిస్తామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

వర‌ద‌ల్లో ముంపున‌కు గురైన ప్ర‌తి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ ప‌ప్పు, లీట‌రు పామాయిల్‌, కేజీ బంగాళ దుంప‌లు , కేజీ ఉల్లిపాయ‌లు ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు.