ఏపీని ఐటీ హబ్ గా తయారు చేస్తా – సీఎం
శ్రీని సిటీ సిఈవోల సమావేశంలో చంద్రబాబు
అమరావతి – ప్రపంచంలోనే అత్యున్నతమైన ఐటీ రంగానికి చెందిన నిపుణులలో అత్యధిక శాతం తెలుగు వారే ఉన్నారని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్బంగా శ్రీని సిటీ వేదికగా జరిగిన వివిధ కంపెనీల సీఈవోలతో ఆయన మాట్లాడారు. ఏపీకి సంబంధించి తాను వచ్చాక రూపు రేఖలు మారాయని స్పష్టం చేశారు.
సంపదను సృష్టించడం ఉపాధి కల్పించడం అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా పలువురు పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలుగా మారారని కొనియాడారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు ఏపీ సీఎం.
సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహద పడుతుందన్నారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని తెలిపారు. 1995లో సియం అయ్యాక పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
తాను వచ్చాక ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టానని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారతీయులు కనబడతారని ఇదే మనకు ఉన్న సంపద అని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారని, ఆ నలుగురిలో ఒకరు ఏపీకి చెందిన ఐటీ నిపుణులు ఉండడం గొప్పనైన విషయమని తెలిపారు.