190 కొత్త 108 వాహనాల కొనుగోలు
ప్రకటించిన సీఎం చంద్రబాబు
అమరావతి – రాష్ట్రంలో వైద్య రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 190 కొత్తగా 108 వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ. 4 వేలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా 58 మహా ప్రస్థానం వాహనాలు తీసుకు వస్తామన్నారు. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఏపీ సచివాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదని అన్నారు. ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు వైద్య , ఆరోగ్య శాఖకు సంబంధించి సమీక్ష చేపట్టాలని, పూర్తి డేటా మంత్రి వద్ద ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో జగన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు. మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.