NEWSANDHRA PRADESH

ఏపీలో నూత‌న విద్యుత్ విధానం – సీఎం

Share it with your family & friends

ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో నూత‌న విద్యుత్ విధానం తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అవసరమైన ప్రణాళికలు రూపొందించాల‌ని ఆదేశించారు.

దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. నూతన ఇంధన విధానంపై అధికారులతో సమీక్షించారు. అత్యుత్తమ విధానాలు, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

దేశంలో ఒక వైపు విద్యుత్ అవసరాలు పెరుగుతుంటే సహజ వనరులు మాత్రం తరిగి పోతున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధార పడటమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు.

గతంలో తెలుగుదేశం హయాంలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇంధన శాఖ సంక్షోభంలో కూరుకు పోయిందని ఆరోపించారు. మళ్లీ సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాల్సిన తరుణం ఆసన్నమైందని స్ప‌ష్టం చేశారు సీఎం.