ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. గిరిజనులు చేపట్టిన ఆందోళన విరమించాలని కోరారు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని అన్నారు. గిరిజనుల అస్తిత్వం కాపాడు కోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జీవో రద్దయిందని, తిరిగి జీవో తీసుకు వస్తామన్నారు.
సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా మన్యం, విశాఖ, తదితర జిల్లాల్లో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా సీఎం గిరిజనులకు సంబంధించిన సమస్యపై ప్రత్యేకంగా స్పందించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల మేలు కోరి పనిచేస్తోందన్నారు. గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎలాంటి అనుమానాలకు లోను కావద్దంటూ కోరారు సీఎం. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు కల్పించిన చరిత్ర తనదేనని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. సీఎం ప్రకటన చేయడంతో తాత్కాలికంగా తమ ఉద్యమాన్ని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి గిరిజన సంఘాలు.