సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – మిర్చి రైతులు ఆందోళన చెందొద్దంటూ కోరారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మధ్య దళారీల వ్యవస్థ లేకుండా చేస్తామన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశామని చెప్పారు సీఎం. సచివాలయంలో రైతులు, లారీ యజమానులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….మిర్చి రైతుల నుంచి కిరాయి ఎక్కువ వసూలు చేసే లారీ యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణాను కొందరు తమ గుప్పెట్లో పెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించవద్దని సూచించారు. మిర్చి యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు ఏర్పాటు చేసి మిర్చి టిక్కీలు కాటాలు వేసిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కోల్డ్ స్టోరేజీలో టిక్కీలు నిల్వ చేసుకున్న రైతులకు బాండ్ల ఆధారంగా రుణాలు ఇచ్చేలా త్వరలో బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. గుంటూరులోని స్పైస్ పార్క్‌లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రైతులు మిర్చిని కల్లాల్లో ఆర బెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు.
శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై రసాయనాల తగ్గుదల, పెట్టుబడి ఖర్చులు తగ్గించే అంశంపైనా సలహాలు ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన భూసార పరీక్షలు మళ్లీ ప్రవేశ పెడతామని, తద్వారా నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏఏ పంటలు సాగుచేసుకోవచ్చునో తెలుసుకోవచ్చు అన్నారు.
క్వింటా మిర్చిధర రూ.11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని ప్రతిపాదనలు ఉంచినట్లు సీఎం తెలిపారు. దీనికి కేంద్రం అంగీకారం తెలిపింది అన్నారు. దీనిలో 50 శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాల్సి ఉందన్నారు. అయితే ఈ విధానం అమలు చేస్తే పక్క రాష్ట్రాల్లోని రైతులు, వ్యాపారులు ఏపీకి పంటను తెచ్చి అమ్ముకునే ప్రమాదం ఉందని, తద్వారా ఏపీ రైతులకు న్యాయం జరగదని రైతులు అభిప్రాయపడ్డారు.
దీనిపై కేంద్రంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. 2017లో కూడా ధర పతనమైనప్పుడు వెంటనే తమ ప్రభుత్వం స్పందించి క్వింటాకు రూ.1500 చొప్పున అందించామని, అందుకు రూ.135 కోట్లు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు.