ఆదివాసీలకు సీఎం ఖుష్ కబర్
గిరిజనుల అభివృద్దిపై ఫోకస్
అమరావతి – ఆదివాసీల అభివృద్ది కోసం కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు 9న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు ఏపీ సీఎం. గిరిజన ప్రాంతాలలో ప్రతి ఊరికి రోడ్డు వేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ తాగు నీరు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు.
ఇంటింటికీ నీరు ఇచ్చేందుకు గాను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు సీఎం. డీఎస్సీ కోసం గిరిజనులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన విధంగా గిరిజన యువతీ యువకులకు ఇన్నోవా కార్లను బతికేందుకు ఇస్తామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
గిరిజనులకు అర్హులైన వారికి రుణాలు ఇస్తామన్నారు. గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ కోసం కొత్త భవనాలు కడతామని చెప్పారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి మొదలు పెడతామని తీపి కబురు చెప్పారు.