ఏపీకి రండి పెట్టుబడులు పెట్టండి – సీఎం
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామని, ఎవరైనా ముందుకు వస్తే వారికి సాదర స్వాగతం పలుకుతామని తెలిపారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
తమ కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించేందుకు సిద్దంగా ఉందన్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ముందుకు వెళుతోందని మీరంతా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు సీఎం.
మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో వ్యాపార అనుకూల రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రతిభావంతులైన యువకులు, బలమైన మౌలిక సదుపాయాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు సీఎం.
కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్ పరిశ్రమ అనుభవజ్ఞులతో సమగ్ర సంప్రదింపుల ఆధారంగా రూపొందించడం జరిగిందని స్పస్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పాలసీ ఫ్రేమ్‌వర్క్ మన రాష్ట్రంలో వ్యాపారాలను, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
తాము దేశంలో అత్యుత్తమ వ్యాపార పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీలో మీ పునాదిని ఏర్పరచు కోవడానికి, అభివృద్ధి చెందడానికి ఏపీ సర్కార్ ప్రతి అడుగు తీసుకుంటుందని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదన్నారు. ఈ ఉత్తేజకరమైన వృద్ధి ప్రయాణంలో మాతో సహకరించాలని కోరారు.