మార్కెట్ కమిటీల నియామకానికి శ్రీకారం
ఏపీలో మరోసారి పదవుల పందేరానికి ఓకే
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సంక్రాంతికి రాష్ట్రంలోని మార్కెట్ యార్డు కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం కల్పించనున్నారు. క్షేత్ర స్థాయిలో 10 వేలకు పైగా పదవులు దక్కే ఛాన్స్ ఉంది. కూటమి నేతలకు నూతన ఏడాది కానుకగా ఇవ్వనున్నారు సీఎం. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీ పదవులను జనవరిలో భర్తీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే లోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో ఒక్కో దానికి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమించనున్నారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్ చేస్తారు.
ఇదిలా ఉండగా జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వందల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్ పాలక వర్గాలు నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది.
వీటిని జనవరిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది . ఇప్పటికే ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ రేసులో పలువురు ఆయా జిల్లాల ప్రెసిడెంట్లు ఉన్నారు. సాంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలో 14 ఉప కులాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో బెస్తల జనాభా ఎక్కువ ఉన్నా కూడా.. ఎలాంటి నామినేటెడ్ పదవులు దక్కలేదు.
కాగా ఆఫ్కాఫ్ చైర్మన్ పదవిని ఈ సారి రాయలసీమ ప్రాంతానికి కేటాయించాలని అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారినే నియమించాలని చూస్తున్నారు సీఎం. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకం పైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామక కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది.
వీటికి ఎన్నికలు ఉండవు. కానీ రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్ పాలక వర్గాలను నియమిస్తారు.
రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైైర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమించనున్నారు. రొటేషన్‌లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ అవుతాయి.