మాట మార్చిన సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరుగుతాయని తాము చెప్పలేదన్నారు. కూటమి సర్కార్ పై అప్పుల భారాన్ని గత జగన్ రెడ్డి సర్కార్ మోపిందన్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు తీసుకు వచ్చిన డబ్బులు వడ్డీలకే సరి పోవడం లేదంటూ వాపోయారు సీఎం. ప్రజలు తమ ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరారు.
ఆరు నూరైనా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని ప్రకటించారు. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, అన్నింటిని చేజిక్కించు కోవాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు సీఎం.
రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏ ఎన్నిక వచ్చినా అధికార పక్షం గెలిచినప్పుడే రాష్ట్రంలో సుస్థిర పాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని ఉద్బోధించారు. ఇచ్చిన హామీలపై కృషి చేయాల్సిన అవసరం ఉందని, అయితే రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడంలేదని నేతలతో అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకుంటూనే హామీలు అమలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, గాడి తప్పిన వ్యవస్థలను ఇప్పుడు చక్క దిద్దుతున్నామని చెప్పారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.