సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – కార్యకర్తలే టీడీపీకి బలమని అన్నారు సీఎం చంద్రబాబు. వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ 43వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. మన కుటుంబంలోని సభ్యులందరికీ ఇవాళ పండుగ రోజు అన్నారు. వివిధ వర్గాల ప్రజలు రకరకాల పండుగలు జరుపుకుంటారని, కానీ అన్నివర్గాల వారు జరుపుకునే పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవమన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు సీఎం. ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తున్నామని అన్నారు.
పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగు జాతిని అన్ని విధాలా మందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిందన్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారని గుర్తు చేశారు. తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచానని చెప్పారు. . రోజురోజుకూ టీడీపీ బలోపేతమవడానికి కార్యకర్తలే కారణమన్నారు. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి అని పేర్కొన్నారు. సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడ్డామన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు రూ.2లకే కిలో బియ్యం, పెన్షన్, జనాతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారన్నారు.