ఏపీకి నిధులివ్వండి..ఆదుకోండి
సీఎం నారా చంద్రబాబు నాయుడు
న్యూఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాల గురించి చర్చించారు. ఏపీ ప్రస్తుతం అప్పుల్లో ఉందని, వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఆదుకోవాలని పీఎంకు విన్నవించారు సీఎం.
రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకారం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు నారా చంద్రబాబు నాయుడు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై విస్తృతంగా చర్చించారు సీఎం.
ప్రధానంగా ప్రతిష్టాక్మంగా పునర్ నిర్మించ బోయే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల ఆర్ధిక సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా వైజాగ్ రైల్వే జోన్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించినట్లు సమాచారం .