అన్ని కార్పొరేషన్లలో ఆడిటింగ్ చేపట్టాలి
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం కారణంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన సచివాలయంలో పెట్టుబడులు-మౌళిక సదుపాయాల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ మోహన్ రెడ్డి సాగించిన పాలన పూర్తిగా ఇబ్బందులకు గురి చేసేలా చేసిందన్నారు. వివిధ రకాల కార్పోరేషన్లల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రధానంగా ఫైబర్ నెట్ కనెక్షన్ల లెక్కలు లేవంటూ అధికారులు చెప్పడంతో ఆయన విస్తు పోయారు. కనెక్షన్ల ఛార్జీల సొమ్మును కూడా దోచేసుకున్నారా అంటూ ప్రశ్నించారు ఏపీ సీఎం. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో వెంటనే ఆడిటింగ్ చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.