ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. వీటిని నిర్వహించడం పట్ల స్పందించారు సీఎం.
ఈ సందర్బంగా ఎనలేని సంతోషం వ్యక్తం చేశారు . ఈ సభలకు విచ్చేసిన అతిథులు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అలాగే మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందన్నారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయమైన కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం కూడా తనకు మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
శనివారం ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.