రాష్ట్రమంతటా అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాల ధాటికి తల్లడిల్లుతున్నారు . బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి.
ఈ సందర్బంగా శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక , ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎవరూ కూడా విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించ వద్దని సూచించారు. విపత్కర సమయంలోనే పనితీరు మరింత మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వడం వల్ల చాలా చోట్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమస్యను ఎదుర్కొవాలని ఆయన అన్నారు.
ప్రకృతివైపరీత్యాల యాజమాన్య వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆ వ్యవస్థను వెంటనే అమలులోకి తీసుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.