ఐఏఎస్..ఐపీఎస్ ల బదిలీపై కసరత్తు
సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీలో పాలనా పరంగా ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్దం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా శనివారం కీలక సమావేశం చేపట్టారు. ఈ కీలక భేటీలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే దూకుడు పెంచారు. ప్రధాన పథకాలకు సంబంధించిన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం దశల వారీగా సంస్కరణలకు శ్రీకారం చేపడతామని తెలిపారు. ప్రధానంగా కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు గత ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో మొదటి వేటు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డిపై పడింది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జే . శ్యామలా రావును నియమించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా సీఎంఓ , సీఎస్, డీజీపీలతో భేటీ అయ్యారు. ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు. సమర్థులు, రూల్స్ ప్రకారం పని చేసే వారికి ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించారు.