ప్రజా ప్రభుత్వం అభివృద్దికి సోపానం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ప్రజలే చరిత్ర నిర్మాతలు. వారు లేక పోతే ఈ సమాజం లేదు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తమకు ఆదర్శమని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇప్పుడున్న రాజ్యాంగం మంచిది, మీరు ఎన్నుకున్న పాలకులు మంచి వారు. మంచి చేసే మా ప్రభుత్వానికి, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు సీఎం.
ఐదేళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన చూసి మేనిఫెస్టో చేశామని అన్నారు. హామీ ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశామన్నారు సీఎం ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశామని చెప్పారు. మాది పేదల ప్రభుత్వం. పేదల సేవలో ముందుండే ప్రభుత్వం.పేదల పింఛన్లు పెంచాం. దివ్యాంగుల పింఛన్ డబుల్ చేశాం. ఒకటో తేదీనే 96 శాతం పింఛన్లు పంపిణీతో రికార్డ్ సృష్టించామని అన్నారు చంద్రబాబు నాయుడు.