ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. తన ఐదేళ్ల పాలనా కాలంలో ఏపీని సర్వ నాశనం చేశాడని మండిపడ్డారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడాడంటూ ఎద్దేవా చేశారు.
చివరకు దిక్కులేని దానిగా మార్చేశాడని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైందని వాపోయారు . వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసానికి గురైనట్లు తెలిపారు. ఏపీకి రావాలంటేనే భయపడే స్థితికి తీసుకు వచ్చాడని ధ్వజమెత్తారు.
గురువారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో పుట్టిన వాళ్లు తిరిగి తమ ప్రాంతానికి రావాలంటే జంకే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క పరిశ్రమైనా తీసుకు వచ్చాడా అని ప్రశ్నించారు.
తాము వచ్చాక ఖజానాలో ఒక్క పైసా లేకుండా పోయిందన్నారు. కానీ మెల మెల్లగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్లాన్ చేశామన్నారు.