సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా భాషల అమలుపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంటోంది. ఈ తరుణంలో భాషకు సంబంధించి కూటమికి చెందిన నేతలు, ప్రధానంగా టీడీపికి చెందిన వారు ఎవరూ కూడా నోరు విప్పవద్దని స్పష్టం చేశారు. దాని వల్ల అనవసర రాద్దాంతం చోటు చేసుకుంటుందన్నారు. అవగాహన ఉంటేనే తప్పా మాట్లాడాలి తప్పా లేకుండా మాట్లాడితే అభాసుపాలయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎవరూ కూడా పార్టీ లైన్ దాటవద్దని లేక పోతే చర్యలు తప్పవని చురకలు అంటించారు.
ఇదిలా ఉండగా ఈ మధ్యన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భాషలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మండిపడ్డారు. ఈ దేశంలో బహు భాషలు ఉండాల్సిందేనంటూ కుండ బద్దలు కొట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ జనసేన జయకేతనం సభలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్. తాము భాషకు వ్యతిరేకం కాదని, కానీ తమపై బలవంతంగా రుద్దితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ కేంద్రాన్ని, పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మాటల యుద్దం కొనసాగుతోంది.