అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
దివాళా అంచున రాష్ట్రం
అమరావతి – సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. లెక్కకు మించి అప్పులు చేయడంతో అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. దీనికంతటికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన నిర్వాకమేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెచ్చిన అప్పులు వడ్డీలు తీర్చేందుకే సరి పోతోందన్నారు. భారమైనా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు సీఎం.
నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఆర్ధిక సమస్యలున్నా, జనం నమ్మకాన్ని నిలబెడుతూ, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతూ, ప్రజల కష్టాన్ని మేము తీసుకుని వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు.
వైసీపీ అసమర్థ పాలనతో ఆర్థిక ఆరోగ్య సూచీలో అట్టడుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని, ఈ విషయం నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. ఆర్థిక ఆరోగ్య సూచీలో 17వ స్థానంలో ఏపీ ఉండడం బాధ కలిగించిందన్నారు.
గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేశాడంటూ జగర్ రెడ్డిపై మండిపడ్డారు. బీహార్ కన్నా రాష్ట్రం పతనం అయ్యింది. అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందన్నారు.