స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, రోజు రోజుకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆదాయం పూర్తిగా తగ్గిందని, బయట అప్పులు పుట్టడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా పెన్షన్ల పంపిణీని ఆపడం లేదన్నారు. ఠంఛనుగా ప్రతి నెలా ఒకటవ తేదీనే లబ్దిదారులకు వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నామని చెప్పారు సీఎం.
గత ఐదేళ్ల పదవీ కాలంలో జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. తనతో పాటు తన పరివారం దోచుకోవడం, దాచు కోవడానికే ప్రయత్నం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
అందుకే ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమికి పట్టం కట్టారని, ప్రజలను ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డిని, ఆయన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారంటూ ధ్వజమెత్తారు. జగన్ చేసిన లక్షల కోట్ల అప్పులకు వచ్చిన ఆదాయం కేవలం వడ్డీలు కట్టేందుకు సరి పోతోందని, జీతాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇచ్చేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.