అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చండి
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అందినంత మేర దోచుకున్నారని ఆరోపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన రెవిన్యూ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి బొమ్మల పిచ్చితో ఏకంగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 700 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇదంతా ప్రజల సొమ్మేనని పేర్కొన్నారు.
ఇక వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వీటికి సంబంధించి విచారణ జరిపించి లెక్కలు తేల్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ పి సిసోడియా, సిసిఎల్ఎ ఆయా జిల్లాల్లో పర్యటించి సమాచార సేకరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు సీఎం. 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ల దగ్గర మరోసారి పరిశీలించి వాటిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.