ప్రజల కోసం కాన్వాయ్ ఆపిన సీఎం
వినతి పత్రాలు స్వీకరణ..పరిష్కరిస్తానని హామీ
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. తనదైన స్టైల్ లో పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో తన కొడుకు, మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు మంచి స్పందన రావడాన్ని ఆయన అభినందించారు. ఇదే సమయంలో తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కోసం వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యలను వినే ప్రయత్నం చేస్తున్నారు.
షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ఎవరికీ ఆటంకం కలిగించ వద్దంటూ ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఏకంగా తన కాన్వాయ్ ను ఆపేశారు. వెంటనే కిందకు దిగారు. ఉండవల్లి లోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తన కోసం కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. అందరి వద్ద వినతులు స్వీకరించారు. వారిని పేరు పేరునా పలకరించారు. వారు తెలియ చేసిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కారు దిగి తమతో మాట్లాడటంతో బాధితులు సంతోషానికి లోనయ్యారు.