రైల్వే లైన్ కు ఆమోదం సీఎం సంతోషం
ప్రధానమంత్రి మోడీకి బాబు ధన్యవాదాలు
అమరావతి – కేంద్ర మంత్రివర్గం గురువారం ఏపీ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం తరపున రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం 57 కిలోమీటర్ల నిర్మాణానికి రూ. 2,245 కోట్ల రూపాయలు ఖర్చు కానుందని తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రానికి సంబంధించి ఇంకా రావాల్సిన పెండింగ్ నిధులు ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేయాలని ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం గనుక పూర్తయితే దేశంలోనే అత్యుత్తమమైన వసతి సౌకర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు.