ఏపీ ప్రజలు రుణపడి ఉన్నారని కామెంట్
అమరావతి – విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ. 11, 440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఉక్కుతో చెక్కబడిన చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు సీఎం.
ఈ సాయం దేశ నిర్మాణానికి దోహద పడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదని, పోరాటాలకు, త్యాగాలకు స్మారక చిహ్నమన్నారు. త్వరలోనే ఏపీకి మంచి రోజులు రానున్నాయని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఏరోజూ దాని బాగు గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
జగన్ రెడ్డి అండ్ తన పరివారం పూర్తిగా దోచుకునేందుకే ఐదేళ్ల సమయాన్ని వెచ్చించారని అన్నారు. కానీ తాము వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల భారం నుంచి బయట పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.