సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్చగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్ , గంజాయి వాడకం విపరీతంగా పెరిగిందన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే తిరిగి తమ కార్యలయంపైనే దాడులు చేశారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయమంటే దేవాలయం అన్నారు. గతంలో ఎక్కడా పార్టీ ఆఫీస్ లపై దాడులు జరిగిన ఘటనలు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.
రాజకీయ కక్షసాధింపులకు తాను దూరంగా ఉంటానని అన్నారు. గత పాలకులు కనీసం గంజాయి, డ్రగ్స్ పై సమీక్ష చేయలేదన్నారు. అసెంబ్లీలో చర్చించిన పాపాన పోలేదన్నారు. మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారిలో మార్పు అంత తేలిగ్గా రాదన్నారు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయి సాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. స్వార్ధం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదన్నారు.