ఏపీలో ఐటీ..ఎలక్ట్రానిక్స్..డ్రోన్ పాలసీ
సమీక్షించిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకు వస్తున్న నూతన పాలసీపై నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకు రావాలని సూచించారు. అదే విధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వీటిని మరింత మెరుగు పరచాలని అధికారులకు సూచించారు.
ఈనెల 22, 23వ తేదీల్లో తలపెట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.