భారీ వర్షాలపై సీఎం సమీక్ష
అంతా అప్రమత్తంగా ఉండాలి
అమరావతి – వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదైందని తెలిపారు అధికారులు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు జరిగిందన్నారు. ఈ సందర్బంగా సీఎం పలు సూచనలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి…పర్యవేక్షణ ఉంచాలన్నారు.
అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలన్నారు.
ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.
వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉంచాలన్నారు. పూర్తి అప్రమత్తతో ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చూడాలన్నారు.
సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు