సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
అమరావతి – ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయిన 5 స్థానాలలో ఒకటి జనసేన పార్టీకి చెందిన నాగబాబు కొణిదెలకు కేటాయించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు. సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే నాగ బాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇందులో భాగంగా తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో నాగ బాబుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఇదిలా ఉండగా నాగబాబు నటుడిగా, జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత తన సోదరుడు స్థాపించిన జనసేన పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల సమయంలో తానే దగ్గరుండి చూసుకున్నారు. పార్టీకి సంబంధించి బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో కంటికి రెప్పలా తన సోదరుడిని చూసుకున్నారు.
ప్రస్తుతం జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సర్కార్ ఏర్పాటు కాగానే ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఇస్తారని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చంద్రబాబు నాయుడు టీవీ5 చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడుకు అప్పగించారు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీనిపై సీఎంతో చర్చించారు పవన్ కళ్యాణ్. తన సోదరుడికి ఛాన్స్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో కేబినెట్ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.